తెలుగు సినీ పరిశ్రమపై చెరగని ముద్ర.. రావి కొండలరావు మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగం

Spread the love

ప్రముఖ నటులు, రచయిత రావి కొండల రావు మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. ఆయన మరణం తీరని లోటు అంటూ పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను స్మరించుకొంటున్నారు. రావి కొండల రావు మరణంపై పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తూ సంతాప ప్రకటనను విడుదల చేశారు. పవన్ కల్యాణ్ తన సంతాప ప్రకటనలో ఏమన్నారంటే. ప్రముఖ నటులు, రచయిత శ్రీ రావి కొండల రావు గారు తుది శ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. తెలుగు చిత్రసీమకు శ్రీ రావి కొండలరావు అందించిన బహుముఖ సేవలు అజరామరం. ఆయన మరణం సినీ రంగానికి ఒక లోటు అని తన సంతాప ప్రకటనలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు

సేవలు మరువలేనివి
రావి కొండలరావు నాటక రచయితగా, నటుడిగా రంగస్థలానికి, పాత్రికేయుడిగా సినీ జర్నలిజానికి చేసిన సేవలు మరువలేనివి. సినీ రంగంలోని ఎన్నో మలుపులను అక్షరబద్ధం చేశారు. ఆరు దశాబ్దాలకుపైబడి తెలుగు సినీ రంగంతో అనుబంధం కలిగి ఉన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ సంస్థతోను, సినీ దిగ్గజాలు బాపు, రమణలతోను సన్నిహిత సంబంధాలు కలిగిన శ్రీ రావి కొండలరావు గారు నటుడిగా, సినీ కథా రచయితగా తన ముద్రను వేశారు అని తన ప్రకటనలో తెలిపారు

అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవితో

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ‘పెళ్లి పుస్తకం’ చిత్రానికి కథా రచయితగా అందరి ప్రశంసలతోపాటు పలు పురస్కారాలు అందుకున్నారు. నా అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు మంత్రిగారి వియ్యంకుడు, చంటబ్బాయి లాంటి వాటిలో శ్రీ కొండలరావు గారు పోషించిన పాత్రలు అందరికీ గుర్తుండి పోతాయి. గతేడాది ఒక పుస్తకావిష్కరణ సభలో వారిని కలిసినప్పుడు సినీ రంగ ప్రస్థానం, మలుపులు గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *