వాళ్లకు సహాయం చేయడం నా బాధ్యత

Spread the love

sonu sood  latest images

ఇప్పుడు సహాయం అంటే ఎవరికైనా ఆయనే గుర్తుకు వస్తారు… కాళ్లరిగేలా నడుస్తున్న కార్మికునికి… కన్నీరు పెట్టుకుంటున్న కర్షకునికి… విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థికి… ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేయందించిన వారి చిట్టా చాంతాడంతా… ఆయనే వెండితెరపై ప్రతి నాయకుడు… నిజ జీవితంలో కథానాయకుడు సోనూసూద్‌. ఆయన ‘ఈటీవీ భారత్‌’తో సోమవారం ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలివి.


వలస కార్మికులు వాళ్ల సొంతూళ్లకు చేరడం అత్యవసరం. నా తల్లిదండ్రులు అలాంటి వాళ్లకు సహాయం చేయడానికే నాకు చదువు చెప్పించారు. ఆపదలో ఉన్న వారికి చేయందించడం ఈ ప్రపంచంలోనే అన్నింటికన్న ఉత్తమ సేవాగుణం. చాలా మంది ప్రార్థనలు నాతో ఉన్నాయి. వీటితోనే నేను ఇంకా కష్టపడాలనే స్ఫూర్తి పొందుతున్నా. కష్టం అయినా సరే వలస కార్మికులను వాళ్ల సొంతింటికి చేర్చడానికి కృషి చేశా.ప్రజలు నన్ను ప్రేమించినన్ని రోజులు నేను 16 నుంచి 17 గంటలు పనిచేయడానికి భయపడను. మా నాన్న పంజాబ్‌లో ఉచితంగా భోజనం(లంగర్‌) పెట్టేవాడు. అక్కడ చాలా మంది ఇతరుల కడుపు నింపడానికి వాళ్ల సంపాదనలోంచి ఎంతో కొంత ఖర్చు పెట్టడం చూశా. పంజాబ్‌లో లంగర్‌ నిర్వహించడం పెద్ద పనేం కాదు. దీన్ని సిక్‌ గురువులు ప్రారంభించారు. అక్కడ చాలా మంది దీన్ని అనుసరిస్తారు. నాన్న పనిలో నుంచి వచ్చిన స్ఫూర్తే ఈ సమయంలో నాకు ఎంతో తోడ్పడుతుందని అస్సలు ఊహించలేదు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు పొలం దున్నుతున్నప్పుడు నా మనసు వారికోసం తపించింది. అప్పుడే వాళ్లకు ట్రాక్టర్‌ కొనివ్వాలని నిర్ణయించుకున్నా. నేను ఫోన్లో ఆ కుటుంబంతో మాట్లాడా. వారి యోగక్షేమాలు తెలుసుకుని వారికి సహాయం చేశా. ఇప్పుడు ఆ అమ్మాయిలు బాగా చదువుకోవచ్చు. వాళ్ల కుటుంబం కూడా దానికి సులువుగా సహకరించగలదు.

కొన్ని వర్గాలు నేనేదో రాజకీయ లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నానని అంటున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. వాళ్లు నాతో చేతులు కలిపితే ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయవచ్చు. ఇది మాత్రమే నేను వాళ్లకు చెప్పదలుచుకున్నా. పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు నన్ను ప్రోత్సహిస్తున్నారు. కొంత మంది ముఖ్యమంత్రులు ఫోన్‌ చేసి అభినందించారు. ప్రియాంక గాంధీ కూడా ఫోన్‌ చేసి ప్రోత్సహించింది.

నేను ఇప్పుడు ఒక యాప్‌ రూపొందించే పనిలో ఉన్నా. ఇది పేదలకు వాళ్ల నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగం పొందడానికి సహాయపడుతుంది. కొన్ని కార్పొరేట్‌, స్వచ్ఛంద సంస్థలు వాళ్ల కలలు నెరవేర్చడానికి సహాయపడుతున్నాయి. దేవుడు అనుగ్రహిస్తే దీన్ని ఒక వారంలో పూర్తి చేస్తాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *