జనసేన కోసం పీకే టీమ్ ?

Spread the love

ప్రస్తుతం దేశంలో కాలంతో పాటే రాజకీయాలు మారిపోతున్నాయి. తమ బలాలే కాదు ప్రత్యర్ధి బలహీనతలను కూడా బలాలుగా మార్చుకునే సామర్ధ్యం ఉన్న వారే రాజకీయాల్లో రాణిస్తున్నారు. కేవలం ప్రజల చుట్టూ తిరిగి ఓట్లు వేయించుకునే రోజులు పోయాయి. జనాన్ని మేనేజ్ చేసే డబ్బులేవే వ్యూహకర్తలపై పెడితే ఫలితాలు త్వరగా వచ్చేలా ఉన్నాయి. ఏపీలో రాజకీయ పార్టీలు ఈ ఫార్ములాను అతి తక్కువ సమయంలోనే ఒంటబట్టించుకున్నట్లు కనిపిస్తున్నారు. దీంతో గతంలో వైసీపీ భారీ విజయం వెనుక శ్రమించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ బృందంలోని సభ్యులు ఇప్పుడు గ్రూపులుగా విడిపోయి ఇక్కడి రాజకీయ పార్టీలకు అండగా నిలుస్తున్నారు. వీరి వ్యూహాలను సొమ్ముచేసుకునే క్రమంలో వైసీపీ ఇప్పటికే ముందుండగా.. టీడీపీ కూడా ఇప్పటికే ఓ గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుని ముందుకెళుతోంది. తాజాగా మరో పార్టీ జనసేన కూడా మాజీ ఐప్యాక్ టీమ్ సభ్యుల్లో కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

అందరూ వారే..
అంతా ఆ తాను ముక్కలే…
గతంలో వైసీపీ కోసం పనిచేసిన ఐప్యాక్ టీమ్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మానసపుత్రిక. అయితే 2019 ఎన్నికల్లో తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వారి బాధ్యత కూడా పూర్తయింది. దీంతో వారు వెళ్లిపోయారు. అయితే అప్పట్లో ఆ టీమ్ తరఫున పనిచేసిన వారిలో చాలా మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడం, వారిలో పలువురు ఇక్కడి విభిన్న పార్టీల భావజాలాలు కలిగి ఉండటంతో సహజంగానే వాటి ఆధారంగా వీరు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. వీరిలో రాబిన్ శర్మ బృందం ఇప్పటికే టీడీపీకి పనిచేస్తుండగా.. దినేష్ బృందం వైసీపీ ప్రభుత్వం కోసం పీకే కార్పోరేట్ సొల్యూషన్స్ పేరుతో తాజాగా రంగంలోకి దిగింది. ఇదే కోవలో మరో బృందం జనసేన తరఫున పనిచేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ముందుగా సర్వే..
సర్వేతో రంగంలోకి…
ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీమ్ కు ఓ అలవాటు ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ తరఫున పనిచేసినా ముందుగా ఆ పార్టీ గురించి, దాన్ని నడిపించే వారి గురించి జనం ఏమనుకుంటున్నారనేది ఈ టీమ్ గుర్తిస్తుంది. దాని ఆధారంగానే భవిష్యత్ ప్రణాళిక సిద్దమవుతుంది. ఇదే కోవలో ఇప్పుడు మాజీ పీక్ టీమ్ సభ్యుల్లో జనసేన కోసం పనిచేస్తున్న బృందం సర్వే చేపట్టింది. ఈ సర్వేను ఏపీలో ప్రస్తుతం అంతర్గతంగా ప్రజల్లో సర్యులేట్ చేస్తున్నారు. ఇందులో జనసేన గురించి మీ అభిప్రాయం ఏమిటి, పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయి, పవన్ పై మీ అభిప్రాయం ఏంటి ? పవన్ విజయం దిశగా వెళ్లాలంటే ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, పవన్ కు మీరు ఇచ్చే రేటింగ్ ఎంత వంటి పలు ప్రశ్నలున్నాయి. వీటిపై ప్రజల్లో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ముందుకెళ్లేందుకు ఈ టీమ్ సిద్ధమవుతోంది.


సర్వే ఆధారంగా భవిష్యత్ వ్యూహాలు..
ప్రస్తుతం జనసేనతో పాటు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి జనం అసలు ఏమనుకుంటున్నారో తెలుసుకున్న తర్వాత వీటి ఆధారంగా పార్టీలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు, భవిష్యత్ వ్యూహాలు ఖరారు అవుతాయని తెలుస్తోంది. అందుకే ఈ సర్వేను టీమ్ సీరియస్ గా తీసుకుంటోంది. పవన్ జనసేన తరఫున పనిచేస్తున్న టీమ్ సభ్యుల వివరాలు బయటికి రాకపోయినా వీరంతా గత పీకే టీమ్ సభ్యులే అని మాత్రం అర్ధమవుతోంది. అందుకే అచ్చం పీకే తరహా వ్యూహాలతోనే ముందుకెళ్తున్నారు. జనం నాడి పట్టకుండా జనాన్ని గెలవడం సాధ్యం కాదనే సామెతను అక్షరాలా అమలు చేస్తూ ఈ సర్వే సాగుతుండగా… దీని ఫలితాలే జనసేన భవిష్యత్ నిర్దేశించబోతున్నాయని కూడా తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *