
ఆన్లైన్ తరగతులు అర్థం కావడం లేదని ఓ ఇంటర్ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బోయిన్పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. న్యూ బోయిన్పల్లి కంసారి బజార్‌కు చెందిన దేవ యశ్వంత్(18) మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి అశోక్‌కుమార్ ప్లంబర్ కాగా, తల్లి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. న్యాయవాది కావాలన్న లక్ష్యంతో యశ్వంత్ ఇంటర్లో హెచ్ఈసీ గ్రూప్‌ను ఎంచుకున్నాడు. కొవిడ్ కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో ఓ ప్రైవేటు కేంద్రంలో ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నాడు. అయితే, ఆన్లైన్ తరగతులు అర్థం కావడంలేదంటూ కొద్దిరోజులుగా ఆందోళన చెందుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయటి నుంచి వచ్చిన కుటుంబసభ్యులు కిటికీలోంచి చూసేసరికి ఉరి వేసుకొని కనిపించాడు. స్థానికుల సాయంతో యశ్వంత్‌ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సూసైడ్ నోట్ లభ్యం..
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు యశ్వంత్ రాసిన సూసైడ్ నోట్ లభించింది. తన చదువు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ నోట్లో ఉంది. ఆన్లైన్ తరగతులతో తనకు ఏమీ తెలియడం లేదని అందులో పేర్కొన్నాడు. ఎలాగైనా న్యాయవాదిని అవుతానని స్నేహితులతో ఛాలెంజ్ చేశానని పేర్కొన్న యశ్వంత్.. లక్ష్యాన్ని సాధించలేక పోతానేమోనని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆన్లైన్ తరగతుల విషయమై తగిన చర్యలు తీసుకోవాలని ఆ నోట్లో అభ్యర్థించాడు.