చర్చల వేళ.. చైనా వితండ వాదం: ఖాళీ చేశామంటోన్న చైనా..

Spread the love

indian army

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడానికి భారత్, చైనా మధ్య మరోసారి చర్చల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. రెండు దేశాల మధ్య రక్షణ, దౌత్యపరంగా చర్చలు ఇప్పటికే చేపట్టింది భారత్. నాలుగు దఫాలుగా భారత్ చైనా మధ్య రక్షణపరంగా లెప్టినెంట్ కమాండర్ స్థాయిలో చర్చలు ముగిశాయి. అదే సమయంలో అటు దౌత్యపరంగా కూడా చైనాపై ఒత్తిళ్లను తీసుకుని రాగలిగింది. దౌత్యపరంగా రంగంలోకి దిగిన తరువాత చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి గల ప్రాంతాన్ని చాలా వరకు ఖాళీ చేసింది. రెండు కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోయింది.

అయిదు విడత చర్చలు..
వాస్తవాధీన రేఖను ఖాళీ చేసినప్పటికీ.. ఒకట్రెండు కీలక ప్రాంతాల్లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనిక బలగాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. పంగ్యాంగ్ త్సొ, డెప్సాంగ్ వంటి వ్యూహాత్మక, సమస్యాత్మక ప్రాంతాల నుంచి ఇంకా వెనక్కి వెళ్లలేదని అంటున్నారు. పంగ్యాంగ్ త్సొ, డెప్సాంగ్ ప్రాంతాలు భౌగోళికరంగా, రక్షణపరంగా భారత్‌కు అత్యంత కీలకమైనవి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆ ప్రాంతాలను కూడా ఖాళీ చేయించడానికి మరోమారు చర్చల ప్రతిపాదనలను భారత్ తెరమీదికి తీసుకుని వచ్చింది. అయిదో విడత చర్చల కోసం ఏర్పాట్లను చేస్తోంది.

ఖాళీ చేశామంటోన్న చైనా..
ఇలాంటి పరిణామాల మధ్య చైనా.. వితండవాదం చేస్తోంది. వాస్తవాధీన రేఖ ప్రాంతం మొత్తాన్నీ ఖాళీ చేశామని చెబుతోంది. తాము ఇంకా ఖాళీ చేయలేదంటూ భారత్ చెప్పడం సరికాదని చైనా అధికారులు వాదిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు చల్లారాయని, ఇలాంటప్పుడు మళ్లీ చర్చలు ఎందుకని అంటున్నారు. ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులు ధృవీకరించట్లేదు. పంగ్యాంగ్ త్సొ లేక్, డెప్సాంగ్ వంటి ప్రాంతాలు ఇంకా ఖాళీ చేయాల్సి ఉందని అంటున్నారు. వాస్తవాధీన రేఖ సమీపంలో ఇప్పటికీ 40 వేల మంది పీఎల్ఏ బలగాలు మోహరించిన ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

డబ్ల్యూఎంసీసీ భేటీ..
పంగ్యాంగ్ త్సొ ప్రాంతాన్ని ఖాళీ చేయించడానికి భారత్ త్వరలో వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కో ఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. ఈ సమావేశంలో పాల్గొనడానికి తొలుత అంగీకరించిన చైనా అధికారులు.. ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపట్లేదని అంటున్నారు. డబ్ల్యూఎంసీసీ భేటీకి సంబంధించిన సమాచారం తమకు అందినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. దీనితోపాటు రక్షణపరంగా లెప్టినెంట్ కమాండర్ స్థాయి చర్చలను నిర్వహించడానికి భారత ఆర్మీ అధికారులు సమాయాత్తమౌతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *