ఐటీ కంపెనీల్లో 90 రోజుల్లో 11,000 మంది ఉద్యోగులు ఔట్!

Spread the love

బెంగళూరు: కరోనా మహమ్మారి వల్ల వివిధ రంగాలపై భారీ ప్రభావం పడింది. దీంతో ఆయా రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోవడం లేదా వేతనాల కోత చోటు చేసుకుంది. దిగ్గజ ఐటీ కంపెనీల్లో గత 90 రోజుల్లోనే 11,000 మంది రిజైన్ చేశారని తెలుస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి టాప్ కంపెనీల్లో పెద్దమొత్తంలో వెళ్లిపోయారు. ఇందులో టీసీఎస్ నుండి ఎక్కువ మంది వెళ్లిపోయారు.

90 రోజుల్లోనే.. మందగమనంలో ఐటీ

ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో అంటే 90 రోజుల్లో దాదాపు పదకొండువేలమంది ఉద్యోగులను తొలగించాయి ఈ టాప్ కంపెనీలు తొలగించాయి. దీనికి కరోనా వైరస్ లేదా ఆటోమేషన్ ప్రభావం ఏదైనా కావొచ్చునని అంటున్నారు. మూడు నెలల్లో మాత్రం టాప్ 5 టెక్ సంస్థల ఉద్యోగుల సంఖ్య 10,962 తగ్గిపోయింది. టీసీఎస్‌లో అత్యధికంగా 4,786 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. ఇన్ఫోసిస్‌లో 3,138, టెక్ మహీంద్రాలో 1,820, విప్రోలో 1,082, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 136 మంది చొప్పున రిజైన్ చేశారు. ఐటీ కంపెనీల ఉద్యోగుల సంఖ్యలో హెచ్చుతగ్గులే ఐటీ రంగ వృద్ధి, పతనానికి ప్రమాణంగా చెబుతారు. తాజా పరిణామాన్నిబట్టి దేశీయ ఐటీ రంగం మందగమనంలోనే ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయితే రానున్నరోజుల్లో పుంజుకుంటుందని సంస్థలు భావిస్తున్నాయి.

కొంత సమయం పడుతుంది

సంస్థాగత నియామకాల్లో మందగమం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. రాబోవు క్వార్టర్‌లలో పూర్వ వైభవం సంతరించుకోవడం ఖాయమని కూడా టెక్ సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సంస్థ ఆదాయాలు పడిపోయినప్పుడు ఇలాంటివి సహజమేనని చెబుతున్నారు. ప్రధానంగా ఇటీవల కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కాస్త సమయం పడుతుందని చెబుతున్నారు.

200 బిలియన్ డాలర్ల ఇండస్ట్రీ

అయితే అవసరాన్ని బట్టి కంపెనీలు ఉద్యోగులను తీసుకుంటున్నాయి. ఐటీ కంపెనీ 200 బిలియన్ డాలర్ల ఇండస్ట్రీ. టాప్ 5 కంపెనీల్లోనే దాదాపు 20 శాతం ఉద్యోగులు ఉంటారు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ రాబోవు క్వార్టర్‌లలో ఉద్యోగులను నియమించుకుంటామని టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటివి చెబుతున్నాయి. టీసీఎస్ దాదాపు 40వేల మంది ఉద్యోగులను తీసుకోనుంది. మిగతా కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం డిమాండ్ లేదని, క్రమంగా రెండు లేదా మూడో క్వార్టర్ నుండి పుంజుకుంటుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *